

రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో సీతాదేవిని యాక్షన్ సన్నివేశాల్లో యోధురాలిగా చూపించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా స్పందించిన దర్శకుడు నితీష్ తివారీ, సీతాదేవిని శక్తివంతమైన యోధురాలిగా చిత్రీకరించడానికి భారతీయ పురాణ సాహిత్యంలోనే ఆధారాలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా ‘అద్భుత రామాయణం’, ఒడియా భాషలోని ‘బిలంక రామాయణం’ వంటి రచనల్లో సీత పాత్రను విభిన్నంగా, శక్తిమంతంగా చిత్రీకరించారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సహస్ర రావణుడి కథను దర్శకుడు ప్రస్తావించారు. కొన్ని రామాయణ కథనాల ప్రకారం, వెయ్యి తలల సహస్ర రావణుడితో యుద్ధం చేసే సమయంలో శ్రీరాముడు సైతం ఇబ్బందుల్లో పడతాడని, అప్పుడు సీతాదేవి మహాకాళి రూపాన్ని ధరించి ఆ రాక్షసుడిని సంహరిస్తుందని వివరించారు. ఈ కథనాల ఆధారంగానే సినిమాలో సీతాదేవిలోని యోధురాలి కోణాన్ని చూపించామని నితీష్ తివారీ స్పష్టం చేశారు. సీతను కేవలం సహనం, త్యాగానికి ప్రతీకగా మాత్రమే కాకుండా, అవసరమైనప్పుడు దుష్టశక్తులను ఎదుర్కొనే దివ్యశక్తి స్వరూపిణిగా చూపించడం వెనుక పౌరాణిక ఆధారాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!