

కన్నడ బుల్లితెర నటి ఐశ్వర్య పలు సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘అగ్నిసాక్షి’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. నటిగా మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే మైసూరుకు చెందిన హరి వినయ్‌ను ప్రేమించి 2019లో వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగినప్పటికీ, ఆ తర్వాత మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయారంటూ కొంతకాలంగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఐశ్వర్య స్పందిస్తూ, తామిద్దరం విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న అనవసరమైన ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపారు. గత ఏడాదిన్నరగా తామిద్దరం విడివిడిగా ఉంటున్నామని, ఎంతో ఆలోచించిన తర్వాత పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇది తమ వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంటూ, ఈ కష్ట సమయంలో తమ గోప్యతను, స్వేచ్ఛను, మనశ్శాంతిని గౌరవించాలని అభిమానులు, శ్రేయోభిలాషులను కోరారు. వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ కోసం తప్పుడు వార్తలు, వీడియోలు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం, సీరియల్ సన్నివేశాలను సందర్భం లేకుండా ఉపయోగించడం సరికాదని పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఐశ్వర్య స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!