

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, నజ్రియా నజీమ్ దంపతులకు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2014లో వివాహం చేసుకున్న ఈ జంట తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా పంచుకోరు. తాజాగా ఫహాద్ నటించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రమోషన్‌లో ఆయన తన సహనటి సారా పాలేకర్ గురించి మాట్లాడుతూ నజ్రియాను ప్రస్తావించారు. షూటింగ్ సమయంలో సారా చూపించిన ఓపిక, పాత్ర కోసం ఆమె చేసిన సన్నాహకాలను ఫహాద్ ప్రశంసించారు. ఈ సందర్భంగా నజ్రియాపై సరదాగా మాట్లాడుతూ.. తాను “చిన్నపిల్లలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను” అని, ఇంట్లోనే ఒకరిని చూసుకుంటూ ఉండటం వల్ల తనకు ఓపిక అలవడిందని చమత్కరించారు.
ఫహాద్, నజ్రియా ‘బెంగళూరు డేస్’ చిత్రంలో భార్యాభర్తలుగా నటించిన సమయంలో ప్రేమలో పడ్డారు. అనంతరం 2014లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా బయటకు వెల్లడించకుండా, అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో చేసే సరదా వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహించగా, ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవా కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. రాజమౌళి, కార్తికేయ నిర్మాణ భాగస్వామ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!