

ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకుల ఆలోచనా విధానానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తోంది. స్టార్ డైరెక్టర్లు తెరకెక్కిస్తున్న చిత్రాలు ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటూ టాలీవుడ్ స్థాయిని మరింత పెంచుతున్నాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాయి. అసలు ఈ పరాజయాలకు కారణమేంటి? దర్శకులు ఎక్కడ పొరబడుతున్నారు? కథను ప్రేక్షకులకు చేరవేయడంలో ఎదురవుతున్న సమస్యలేంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మంచి కథను ఎంచుకున్నప్పటికీ, దానికి అనవసరమైన హంగులు జోడించడం వల్ల అసలు ఉద్దేశం దెబ్బతింటోంది. స్టార్ హీరో ఉన్నాడనే కారణంతో భారీ పోరాటాలు, రక్తపాత సన్నివేశాలను జోడిస్తే కథలోని సహజత్వం కనుమరుగవుతుంది. కథకు ఏది అవసరమో, తెరపై అదే చూపించినప్పుడే ప్రేక్షకులకు అసలైన అనుభూతి కలుగుతుంది.
మరోవైపు, హీరో ఎవరైనా, బడ్జెట్ ఎంతైనా తమ కథపై నమ్మకంతో ముందుకెళ్లే దర్శకులు కూడా ఉన్నారు. తమ ఆలోచనలకు అనుగుణంగా కథనాన్ని రూపొందిస్తూ విజయాలను అందుకుంటున్నారు. కొన్నిసార్లు వారి అంచనాలు తప్పినా, కథకు అవసరమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి అంశాన్ని బలవంతంగా కథలో ఇరికించడం వల్ల అసలు కథ పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు తమ రోజువారీ సమస్యలను మరిచిపోయి సినిమా ప్రపంచంలో లీనమయ్యేలా చేయడమే దర్శకుడి అసలైన లక్ష్యం. ప్రతి భావోద్వేగం ప్రేక్షకుల హృదయాలను తాకాలి. అలాంటి సినిమాలకే మళ్లీ మళ్లీ చూసే ఆదరణ లభిస్తుంది. అందుకే ఏ తరహా సినిమా తెరకెక్కించినా, తాము చెప్పాలనుకున్న విషయం ప్రేక్షకులకు స్పష్టంగా చేరుతోందా లేదా అనే విషయాన్ని దర్శకులు విశ్లేషించుకోవాలి. అనవసరమైన హంగుల కంటే బలమైన కథనానికే ప్రాధాన్యత ఇస్తేనే సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకుంటాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!