

వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మండాడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించగా.. మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి ద్వారా సెప్టెంబర్ 10న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు చిత్రబృందం వెల్లడించింది. సినిమా విజయంతో పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రశంసలు అందించగా, తాజాగా కమల్ హాసన్ స్వయంగా టీమ్‌ను కలిసి అభినందించారు.
దర్శకుడు మతిమారన్ పుగళేంది, నిర్మాత ఎల్రెడ్ కుమార్‌తో పాటు నటులు సూరి, సుహాస్, రవీంద్ర విజయ్‌లతో కమల్ హాసన్ ప్రత్యేకంగా మాట్లాడి వారి పనితీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా సూరి స్పందిస్తూ.. కమల్ హాసన్‌ను కలవడం తన జీవితంలో మర్చిపోలేని రోజని పేర్కొన్నారు. తమ టీమ్‌పై ఆయన చూపించిన ప్రేమ, అందించిన ఆశీస్సులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక సినిమాకు కథిర్ అందించిన సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా థ్రిల్లింగ్ బోట్ సీక్వెన్స్, హై-వోల్టేజ్ రేసింగ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలకు థియేటర్లలో మంచి స్పందన లభించింది. సూరి, సుహాస్ తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోయడంతో ‘మండాడి’ మరిన్ని వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!