

‘మెంటల్ మది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కఠినమైన దశ గురించి తాజాగా మాట్లాడారు. 2023లో వ్యక్తిగత పరిస్థితులు, కొన్ని నిర్ణయాల కారణంగా డిప్రెషన్, పానిక్ అటాక్స్‌తో ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. ఆ సమయంలో నటనకు పూర్తిగా దూరమవ్వాలని కూడా అనుకున్నానని, మళ్లీ సినిమాల్లో అవకాశాలు రాకపోతే హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ జీవించాలని భావించినట్లు వెల్లడించారు. అయితే పరిస్థితులు క్రమంగా మారడంతో మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడం, నటనపై దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు.
కెరీర్ ప్రారంభంలో తన రూపంపై అసంతృప్తితో పెదవులకు సర్జరీ చేయించుకోవాలని కూడా ఆలోచించినట్లు నివేదా తెలిపారు. ఈ విషయంపై వైద్యుడిని సంప్రదించగా, ఆయన తనను మందలించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి వివరించారని, దీంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని చెప్పారు. సహజమైన రూపంతోనే సాయి పల్లవి, నిత్యామీనన్ వంటి నటీమణులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తీరును చూసిన తర్వాత తన రూపం గురించి అనవసరంగా ఆందోళన చెందకూడదని అర్థమైందని నివేదా పేర్కొన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!