

1993లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన మెగాస్టార్ చిరంజీవి సూపర్‌హిట్ చిత్రం ‘ముఠా మేస్త్రి’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమా విశేషాలను, అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి మాస్ ఇమేజ్‌ను కాపాడుతూనే అద్భుతమైన వినోదాన్ని అందించిన చిత్రమిదని ఆయన పేర్కొన్నారు. మేస్త్రి నుంచి మంత్రి వరకు చిరంజీవి తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని ప్రశంసించారు. ఈ సినిమాలో రోజా నటన కూడా ఎంతో బాగుందని, ‘సర్పయాగం’ తర్వాత ఆమెకు ఈ చిత్రంలో అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి వంటి అగ్ర హీరోతో నటించే అవకాశం రావడంతో రోజా ఎంతో సంతోషించారని, ఆ ఆనందం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించిందని పరుచూరి తెలిపారు.
‘ముఠా మేస్త్రి’ విజయంలో శక్తివంతమైన సంభాషణలు కీలక పాత్ర పోషించాయని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. కులమతాలకు అతీతంగా శ్రమకు ప్రాధాన్యతనిచ్చేలా రాసిన డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని గుర్తుచేశారు. ముఖ్యంగా ‘ఇక్కడ రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ.. రకరకాల కులాలు ఉండవు. ఉన్నది ఒక్కటే కులం.. లేబర్ కులం’ వంటి సంభాషణలకు థియేటర్లలో అభిమానుల నుంచి ఈలలు, కేకలు వచ్చేవని తెలిపారు. అలాగే మూడు మతాల ఐక్యతను చాటిచెప్పే డైలాగ్‌తో పాటు, న్యాయం కోసం పోరాడే వ్యక్తికి పోలీసుల నుంచి ఎదురయ్యే పరిస్థితిని వివరించే సంభాషణ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పారు. ఈ చిత్రంలోని పాటలు, చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్‌లు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణలని ప్రశంసించారు. రీరిలీజ్ సందర్భంగా అభిమానులు తప్పకుండా థియేటర్లకు వెళ్లి ఈ చిత్రాన్ని మరోసారి ఆస్వాదించాలని ఆయన కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!