

నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘రామాయణం’ చిత్రానికి ప్రపంచవ్యాప్త ప్రయాణం ఢిల్లీలో నిర్వహించిన ‘ప్రథమ్ సంకల్ప్’ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ట్రైలర్‌కు ముందు నిర్వహించిన ఈ వేడుకలో దర్శకుడు నితేష్ తివారి, రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, శోభన, రకుల్ ప్రీత్ సింగ్, రవీ దూబే, అజింక్య దేవ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా 500కిపైగా పాఠశాలల్లో నిర్వహించిన రామాయణ స్కూల్స్ ప్రోగ్రామ్ ద్వారా లక్షలాది విద్యార్థులు ఈ మహాకావ్యాన్ని సృజనాత్మకంగా అనుభవించే అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, భారతీయ సంస్కృతికి ప్రతీక అయిన రామాయణాన్ని అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచ ప్రేక్షకులకు అందించడం తమ లక్ష్యమని తెలిపారు. దర్శకుడు నితేష్ తివారి దీనిని శాశ్వత విలువలతో కూడిన విశ్వవ్యాప్త కథగా అభివర్ణించగా, హనుమంతుడి పాత్ర పోషించడం తన అదృష్టమని సన్నీ డియోల్ అన్నారు. సీతామాత పాత్ర తనకు దీవెనగా లభించిందని సాయి పల్లవి చెప్పగా, శ్రీరాముని కథను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడమే తమ అందరి లక్ష్యమని యశ్ వెల్లడించారు. రామానంద్ సాగర్ ‘రామాయణం’లో శ్రీరాముడి పాత్రతో చిరస్థాయిగా నిలిచిన అరుణ్ గోవిల్‌కు రణబీర్ కపూర్ ప్రత్యేకంగా నివాళులర్పించారు. ‘రామాయణం - పార్ట్ 1’ దీపావళి 2026 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!