

రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రామాయణ’ చిత్రబృందం ‘ది విజన్ ఆఫ్ రామాయణ’ పేరుతో కొత్త వీడియోను విడుదల చేసింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక ఇతిహాసం నిర్మాణం వెనుక ఉన్న ఆలోచనలు, కృషిని ఈ వీడియో ద్వారా చూపించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో రామాయణానికి ఉన్న ప్రాధాన్యతతో పాటు కళలు, నిర్మాణ శైలి, నిత్యజీవితంలో ఈ ఇతిహాసం ఎలా భాగమైందో ప్రారంభ భాగంలో వివరించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా భవిష్యత్తు తరాల కోసం రామాయణాన్ని సరికొత్తగా, ధైర్యవంతమైన దృక్పథంతో ఆవిష్కరించాలనుకుంటున్నారని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలు ఆ విస్తృత ప్రణాళికకు ఆరంభం మాత్రమేనని పేర్కొంది. భవిష్యత్తులో వీడియో గేమ్స్, మెర్చండైజ్, స్పిన్‌ఆఫ్‌లు, మూల కథల ఆధారంగా సినిమాలు, టీవీ షోలు, యానిమేషన్ చిత్రాలు, థీమ్ పార్కులను రూపొందించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ వీడియోలో నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అభివృద్ధి చేసిన అంతర్గత సాఫ్ట్‌వేర్ ‘బ్రహ్మ ఏఐ’ గురించి కూడా చూపించారు. సినిమా వివిధ భాషల వెర్షన్లలో డైలాగ్‌లకు అనుగుణంగా పెదవుల కదలికలను సమన్వయం చేయడానికి ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తెరవెనుక దృశ్యాల్లో నటీనటులు, హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో రూపొందించిన భారీ యాక్షన్ సన్నివేశాలు, దుస్తుల రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలు, సంగీత సమావేశాలు కనిపించాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం వేలాది మంది చేసిన కృషిని కూడా వీడియో ప్రతిబింబించింది. అయితే, హనుమంతుడి పాత్రలో నటిస్తున్న సన్నీ డియోల్‌ను మాత్రం చిత్రబృందం మరోసారి చూపించకుండా జాగ్రత్తపడింది. యశ్, సాయి పల్లవి కూడా నటిస్తున్న ఈ చిత్రం 2026 నవంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!