

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కుటుంబానికి చిరునామా మారనున్నట్లు సమాచారం. దాదాపు ఐదు దశాబ్దాలుగా ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న ఖాన్ కుటుంబం త్వరలో కొత్త నివాసంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాంద్రాలోని చింబై ప్రాంతంలో సముద్రతీరానికి సమీపంలో ఆరు అంతస్తుల ఆధునిక భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. సల్మాన్ తల్లి సల్మా ఖాన్ పేరిట ఉన్న స్థలంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ కొత్త నివాసాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. కుటుంబానికి మరింత సౌకర్యవంతమైన జీవనం అందించడమే కాకుండా, భద్రతా పరంగా కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు.
కొన్నేళ్ల క్రితం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల జరిగిన కాల్పుల ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం నిర్మించబోతున్న కొత్త నివాసం ప్రశాంతమైన ప్రాంతంలో ఉండటంతో కుటుంబానికి గోప్యతతో పాటు మెరుగైన రక్షణ కూడా లభిస్తుందని భావిస్తున్నారు. అయితే కొత్త ఇంటిలోకి ఎప్పుడు మారతారన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే, సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రంతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో రాజ్ అండ్ డీకేతో ఓ సూపర్ హీరో సినిమా, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో మరో పీరియాడిక్ ప్రాజెక్ట్ కూడా చర్చల దశలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!