

ట్రైలర్‌తోనే ఆసక్తిని పెంచిన హారర్ థ్రిల్లర్ ‘418’ విడుదల వాయిదా పడింది. కీర్తన్ గౌడ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేయాలనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది.
‘418’ ట్రైలర్‌కు మంచి స్పందన లభించిందని, కొంతమంది ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల కోసం ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. ఇతర భాషల ఎగ్జిబిటర్ల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని, ముఖ్యంగా హిందీ ఎగ్జిబిటర్లు సినిమాను విడుదల చేసేందుకు ఆసక్తి చూపించారని తెలిపింది. దీంతో హిందీలోనూ సినిమాను విడుదల చేసి మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉంటే.. సంగీత దర్శకుడిగా వరుస విజయాలు అందుకుంటూనే నటుడిగానూ మెప్పిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్ మరో విభిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’కు ‘నాకు మరణం లేదు’ అనే ఉపశీర్షిక ఉంది. మారియప్పన్ చిన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయికగా నటించింది. సెప్టెంబర్ 19న ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.
ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి సాంకేతిక అంశాల పరంగా మంచి స్పందన లభించింది. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్, జీవీ ప్రకాశ్ కుమార్ నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వినాయకచవితి సందర్భంగా చిత్ర బృందం తెలుగు విడుదలను ప్రకటించడంతో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ప్రచార చిత్రాన్ని బట్టి చూస్తే.. సస్పెన్స్, థ్రిల్‌తో పాటు రొమాంటిక్ ఎలిమెంట్స్‌ను మేళవించి ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!