

క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో హత్యలు, పోలీసుల దర్యాప్తు, ఊహించని మలుపులు సాధారణమే. అయితే ఒక హత్యకు ప్రత్యక్ష సాక్షిగా మారిన వ్యక్తి నిజంగా ఏం చూశాడు? అతడు చెబుతున్నది నిజమా, అబద్ధమా? అనే ప్రశ్నలతో ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఆసక్తికరమైన చిత్రమే ఆయుష్మాన్ ఖురానా, టబు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా ‘అంధాధున్’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2018లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో మరోసారి ట్రెండింగ్‌లోకి రావడంతో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమాలో ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా) ప్రతిభావంతుడైన పియానో ప్లేయర్. సంగీత ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో తనను తాను అంధుడిగా పరిచయం చేసుకుంటూ జీవిస్తుంటాడు. సోఫీ (రాధికా ఆప్టే) పరిచయంతో ఓ రెస్టారెంట్లో పియానో వాయించే అవకాశం దక్కించుకుంటాడు. అక్కడ పరిచయమైన మాజీ నటుడు ప్రమోద్ సిన్హా (అనిల్ ధావన్) తన భార్య సిమి (టబు) కోసం ఇంట్లో సంగీత ప్రదర్శన ఇవ్వాలని ఆహ్వానిస్తాడు. అయితే అక్కడ ఆకాశ్‌కు ఎదురైన హత్య, దాని వెనుక దాగున్న రహస్యాలు అతడి జీవితాన్ని అనూహ్య మలుపులు తిప్పుతాయి. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ బలమైన స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు, బ్లాక్ కామెడీతో ఆద్యంతం ఉత్కంఠను కొనసాగించారు. ఆకాశ్ పాత్రలో ఆయుష్మాన్ సహజమైన నటనతో ఆకట్టుకోగా, సిమిగా టబు తన అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందింది. రాధికా ఆప్టే కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అమిత్ త్రివేది సంగీతం, డేనియల్ బి. జార్జ్ నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలాన్నిచ్చాయి. ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా ‘మాస్ట్రో’ పేరుతో రీమేక్ చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!