

రైతులు, సైనికులు దేశానికి రెండు కళ్లు వంటివారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైతుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, రైతును ఆర్థికంగా అభివృద్ధి చేసి రారాజుగా చేయడమే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నిర్వహించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచినట్లు తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. తాజాగా 9.34 కోట్ల మంది రైతులకు రూ.18,690 కోట్లను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 30 లక్షల మందికిపైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సాయం పొందుతున్న రైతుల్లో 92 శాతం మంది ఆ మొత్తాన్ని వ్యవసాయ అవసరాలకే వినియోగిస్తున్నారని, 85 శాతం మంది రైతుల ఆదాయం పెరిగిందని వివరించారు.
ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, దీనివల్ల రైతులకు ఎకరాకు సుమారు రూ.18 వేల వరకు ఆదా అవుతోందని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో దాదాపు 40 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు అందించామని, వాటి ద్వారా రూ.50 వేల కోట్ల రుణాలు కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో 1.10 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగు సాధ్యం కాలేదని, ఈ సీజన్‌లో దాదాపు రూ.20 వేల కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అంచనా ఉందని తెలిపారు. రైతులకు మేలు చేసే కొత్త వంగడాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. భారతదేశం వరి ఎగుమతుల్లో అగ్రస్థానానికి చేరడంలో మోదీ కృషితో పాటు శాస్త్రవేత్తల పరిశోధనలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు రైతులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని, రైతు ముఖంలో చిరునవ్వే శాస్త్రవేత్త విజయానికి నిజమైన గుర్తింపు అని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!