

ఓటర్ల సవరణ జాబితాలో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేస్తున్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల పారదర్శకత, ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నికల జాబితాలో పేర్ల తొలగింపు, ఓటు చోరీ ఆరోపణలపై ఎన్నికల సంఘం బహిరంగంగా సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవచ్చేమో కానీ ప్రజల ఓటు హక్కుకు సంబంధించిన ప్రశ్నలను నిర్బంధించలేరని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్క అర్హుడి పేరు అన్యాయంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించినా అది ప్రజాస్వామ్యంపై దెబ్బేనని అన్నారు. ఆధారాలతో వస్తున్న ఆరోపణలను నిష్పాక్షికంగా పరిశీలించి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠ ప్రజల విశ్వాసంతోనే నిలబడుతుందని, బారికేడ్ల ఎత్తులో కాదు.. సమాధానాల స్పష్టతలోనే వ్యవస్థల బలం కనిపిస్తుందని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!