

వచ్చే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ, అభివృద్ధి పనులను వంద శాతం పూర్తిచేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాద్రి రామయ్యను దర్శించిన ఆయన ఆలయంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పుష్కరాల ప్రారంభానికి 15 రోజుల ముందే ఆలయాన్ని సర్వాంగసుందరంగా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. భద్రాద్రి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేయగా, ఆలయ విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం ఇప్పటికే రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.
ఆలయ ప్రాచీన వైభవానికి ఎలాంటి భంగం కలగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట 25 శాతం అదనపు కార్మికులను నియమించి పనుల వేగాన్ని పెంచాలని, ఇంజినీరింగ్ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని నియమించి ప్రతి పది రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్లు, భద్రత వంటి సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల దృష్ట్యా కొత్త స్నాన ఘట్టాలు, యాత్రికుల వసతి సదుపాయాల విస్తరణ కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!