

డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న వివాదానికి ముగింపు పలికేందుకు ఫెడరేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి సాయి రాజేష్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రతినిధులు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్‌లతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం జానీ మాస్టర్‌పై విధించిన శాశ్వత బహిష్కరణను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. జానీ మాస్టర్, సుమలత ఇచ్చిన వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందినట్లు వెల్లడించారు.
మీడియా సమావేశంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఒక కుటుంబంలో జరిగే చిన్నచిన్న విభేదాల మాదిరిగానే ఈ సమస్య కూడా చర్చల ద్వారా పరిష్కారమైందని తెలిపారు. డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులంతా ఇకపై ఐక్యంగా ముందుకు సాగుతారని చెప్పారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, నటుడు నందమూరి బాలకృష్ణ కాకినాడ నుంచి ఫోన్ చేసి సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని, సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని సూచించినట్లు వెల్లడించారు. ఇరువర్గాల డాన్సర్లు పరిశ్రమ కోసం ఎంతో కష్టపడుతున్నారని, ప్రస్తుతం వివాదానికి పూర్తిస్థాయిలో ముగింపు లభించిందని తెలిపారు. ఈ నెల 26న జరిగే జనరల్ బాడీ సమావేశంలో సభ్యులంతా కలిసికట్టుగా ముందుకు సాగనున్నట్లు ఫెడరేషన్ స్పష్టం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!