

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మనుబోతులగూడెంలో పోడు భూముల వివాదానికి సంబంధించి జరిగిన ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో చర్చించి పరిస్థితిని సమీక్షించారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని, విధి నిర్వహణలో ఎవరైనా అతిగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరతరాలుగా పోడు భూములను సాగు చేస్తున్న అర్హులైన గిరిజన కుటుంబాల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని ఆమె స్పష్టం చేశారు.
మంత్రి సీతక్క విజ్ఞప్తికి స్పందించిన అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అడవుల పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత అయినప్పటికీ, గుత్తికోయలు సహా అటవీ ఆధారిత గిరిజన కుటుంబాల జీవనోపాధి, హక్కులను కూడా సమానంగా కాపాడాలని ఆమె పేర్కొన్నారు. కొత్తగా అటవీ భూముల ఆక్రమణలను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టం చేస్తూనే, మానవతా దృక్పథంతో గిరిజనుల సమస్యలను పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!