

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీశాయి. ప్రధాని మోదీతో పాటు ఆయన తండ్రిని, యావత్ దేశాన్ని కూడా ఖర్గే అవమానించారని బీజేపీ మండిపడుతోంది. బిహార్ తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ జయంతి వేడుక ఇటీవల పట్నాలో జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించారు.
మోదీ పదవి నుంచి పోనేపోరని సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఖర్గే ప్రసంగం సందర్భంగా సభలో రెండు మూడు సార్లు పెద్ద పెట్టున అరిచాడు. దీంతో, ఖర్గే మాట్లాడుతూ మోదీనే కాదు.. ఆయన తండ్రి కూడా పోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈలోపు కాంగ్రెస్ శ్రేణులు అతడిని బయటకు తీసుకెళ్లిపోయాయి.
ఈ విషయంపై సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తను అన్నదేంటో అక్కడి వారికి పూర్తిగా వినపడకపోవడంతో కాంట్రవర్సీ మొదలైందని అన్నారు. తాను సభలో రసాభాస సృష్టించడానికి రాలేదని సంతోష్ కుమార్ చెప్పారు. మోదీ పదవి నుంచి దిగిపోవాలనే తాను కోరుకుంటున్నానని చెప్పారు. ‘విప్లవం వస్తేగానీ మోదీ పదవి నుంచి దిగిపోరు’ అని తాను చెబితే వాక్యంలో సగం మాత్రమే జనాలు విన్నారని చెప్పారు.ఈ కామెంట్స్ నేపథ్యంలో ఖర్గేపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీ, ఆయన తండ్రిని కూడా ఖర్గే అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు దేశానికే తలవంపులని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాంగ్రెస్‌లో అసంతృప్తి ఎంత తీవ్రస్థాయిలో ఉందో ఈ జుగుప్సాకర వ్యాఖ్యలు చూస్తే తెలుస్తోందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!