

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తులు, మనీలాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక అడుగు వేసింది. దాదాపు 15 ఏళ్లుగా దర్యాప్తు కొనసాగుతున్న ఈ కేసులో దాల్మియా సిమెంట్స్‌కు సంబంధించిన వ్యవహారంపై తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీబీఐ, ఈడీ కేసుల విచారణ జరుగుతున్న న్యాయస్థానంలో ఈ పత్రాలను సమర్పించింది. ఈ కేసులో జగన్‌తో పాటు పునీత్ దాల్మియా, మరికొందరిపై మనీలాండరింగ్ ఆరోపణలు చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి తొమ్మిది ఛార్జిషీట్లు దాఖలు చేసింది. వాటిని కోర్టు పరిగణనలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తోంది.
సీబీఐ ఆరోపణల ప్రకారం.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ ప్రభుత్వం కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్‌కు లీజుకు ఇచ్చింది. ఈ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ 2013లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం ద్వారా జగన్‌కు సుమారు రూ.150 కోట్ల మేర అక్రమ ప్రయోజనం కలిగిందని పేర్కొంది. ఇందులో రఘురామ్ సిమెంట్స్‌లో రూ.95 కోట్ల విలువైన షేర్లు, రూ.55 కోట్లు హవాలా మార్గంలో అందినట్లు ఆరోపించింది. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. గతేడాది దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను సాంకేతిక కారణాలతో కోర్టు వెనక్కి పంపడంతో, లోపాలను సరిదిద్ది అదనపు ఆధారాలు, అవసరమైన అనుమతులతో తాజాగా మరోసారి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ పత్రాలు కోర్టు పరిశీలనలో ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!