

తెలంగాణలో విద్యుత్ కోతలు ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం గురించి ముందుగానే తెలిసినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టుల ద్వారా సకాలంలో నీటిని ఎత్తిపోసి నిల్వ చేసి ఉంటే కరవు పరిస్థితులను నివారించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. రైతుల సమస్యల కంటే ప్రభుత్వానికి ముఖ్యమైన అంశం ఏముంటుందని ప్రశ్నించారు.
సింగూరు ప్రాజెక్టు నిర్వహణపైనా హరీశ్‌రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరమ్మతుల పేరుతో 29 టీఎంసీల నీటిని ఖాళీ చేసి, పనులు చేపట్టకుండా ప్రాజెక్టును నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల ప్రజలకు తాగునీటిని ఎలా అందిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం సింగూరు జలాశయంలో కేవలం 3 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నప్పటికీ బీరు తయారీ కంపెనీలకు నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది మంది ప్రజల తాగునీటి అవసరాల కంటే మద్యం పరిశ్రమల ప్రయోజనాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని విమర్శిస్తూ, ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!