

ఔషధాల ధరలను నియంత్రించి, అత్యవసర మందులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇందుకోసం సమగ్ర జాతీయ ఔషధ ధరల నియంత్రణ విధానాన్ని తీసుకురావాలని కోరారు. క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్లను తగ్గించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. గుండె, కిడ్నీ, మధుమేహ వ్యాధులకు ఉపయోగించే మందుల ధరలను కూడా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణాధార మందుల ధరలు పెరగడం వల్ల రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
అత్యవసర, ప్రాణాధార మందులపై ట్రేడ్ మార్జిన్లకు పరిమితులు విధించాలని లింగమనేని రమేశ్ సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరిన్ని ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రాల ఆరోగ్య బీమా పథకాలతో అనుసంధానించడం ద్వారా వైద్య సేవలను మరింత విస్తృతం చేయవచ్చని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో వైద్యరంగ నిపుణులైన ఎంపీలతో ఔషధ ధరల నియంత్రణపై ప్రత్యేక చర్చ జరపాలని సూచించారు. ఈ చర్యల ద్వారా నాణ్యమైన మందులు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!