

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని, ‘మొహబ్బత్ కీ దుకాన్’ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు కారణంగానే క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన ఇంటి వద్దకు వెళ్లి తలుపులు పగులగొట్టి అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమయంలో క్రిశాంక్ కుమార్తె తీవ్రంగా ఏడ్చిందని ఆయన అన్నారు.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో అరెస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వాటిని ఉల్లంఘిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా, పాలకులను విమర్శించడం నేరమా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసే సమయంలో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం సరైన విధానమా అని నిలదీశారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించినట్లు గతంలో నివేదికలు వెలువడ్డాయి; రాజకీయ విమర్శలపై యాంత్రికంగా కేసులు నమోదు చేయకుండా ఫిర్యాదులపై ముందుగా విచారణ, ధృవీకరణ అవసరమని ఆదేశాలు ఉన్నట్లు వెల్లడైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!