

హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ మహాపాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. జాతీయ జెండా చేతబూని గన్‌ఫౌండ్రీ నుంచి ఎంజే మార్కెట్ వరకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ మేర పాదయాత్ర చేశారు. అంతకుముందు శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో తెలుగులో పోస్టు చేసిన అమిత్‌షా.. అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజలంతా సుఖశాంతులు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం బీజేపీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, భారత్ మాతాకీ జై, జైశ్రీరామ్ నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని, కాంగ్రెస్ సర్కారును గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడి అరాచకత్వాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉందని అమిత్‌షా అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ భారతదేశంలో విలీనమయ్యేది కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ బచావో ర్యాలీ చొరబాటుదారులను కాపాడేందుకేనని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)లో చనిపోయినవారి, డూప్లికేట్ ఓట్లను తొలగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని విమర్శించారు. ప్రజల ఆదరణతోనే ప్రధాని మోదీ గెలిచారని, ఎస్‌ఐఆర్ తో కాదని పేర్కొన్నారు. ఈవీఎంలపై కాంగ్రెస్ విమర్శలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఎప్పటికీ దేశ ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!