

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో ప్రజలకు హామీలు ఇచ్చి, ఓటు వేయకుండా హెలికాప్టర్‌లో వెళ్లిపోయారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొడుతూ ఎన్నికల ప్రచారం చేసిన జగన్.. చివరకు తన బాధ్యతను విస్మరించారని విమర్శించారు. సోమవారం ముదిగుబ్బలో స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ బీకే పార్థసారథితో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం కూటమి నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే, జగన్ ప్యాలెస్‌కే పరిమితమయ్యారని, తన చెల్లెలి ఆస్తిని కూడా కబ్జా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నిర్మించిన ఇళ్లకు వైకాపా రంగులు వేసుకుని ప్రచారం చేసుకుందని విమర్శించారు.
ముదిగుబ్బలోని జిల్లేడుబండ రిజర్వాయర్ రైతులకు వైకాపా ప్రభుత్వం అన్యాయం చేసిందని సత్యకుమార్ ఆరోపించారు. రూ.25 కోట్ల కమీషన్ తీసుకున్నారంటూ విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఉద్దేశించి.. వీడియోలు తీసుకుంటూ ఇంట్లో కూర్చుంటే నాయకుడైపోరని వ్యాఖ్యానించారు. ధర్మవరం పట్టణంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, కూటమి కార్యకర్తలపై దాడులు చేసినా సహించేది లేదని హెచ్చరించారు. ముదిగుబ్బకు త్వరలోనే కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామని, భవిష్యత్తులో యుద్ధవిమానాల తయారీకి సంబంధించిన పరిశ్రమలు కూడా జిల్లాలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!