

జైలులో తన ఆరోగ్యం క్షీణిస్తోందని, భార్య బుష్రా బీబీకి కూడా సరైన వైద్యం అందడం లేదని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అత్యవసర వైద్య చికిత్స కోరారు. ఆయన తరఫు న్యాయవాది సల్మాన్ సఫ్దర్ విడుదల చేసిన లేఖలో ఖాన్ తన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోజుకు 22 గంటల వరకు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని, కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు తగిన అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. పుస్తకాలు, టెలివిజన్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని పేర్కొన్నారు. మెదడులో రక్తస్రావం, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు తెలిపారు. తన కుడి కంటి చూపు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆరోపించారు. ఏప్రిల్‌లో బుష్రా బీబీ కంటిలోని రెటీనా పొర విడిపోయిందని, మరోసారి శస్త్రచికిత్స చేయించుకోకపోతే ఆమె చూపు కోల్పోయే ప్రమాదం ఉందని ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను పాకిస్తాన్ అధికారులు ఖండించారు. జైలులో ఆయనకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఆయన కోరుకున్న ఆహారాన్నే అందిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్ ఫజల్ చౌధురి తెలిపారు. వారానికి ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇటీవల కంటికి ఇంజెక్షన్ వేయించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని అధికారులు చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉండగా, ఆయనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. 2018 నుంచి 2022 వరకు పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసిన ఆయన, తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపిస్తున్నారు. ఆయన విడుదల కోసం మద్దతుదారులు నిరసనలు కొనసాగిస్తుండగా, సరైన వైద్యం అందించాలని పలువురు మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు విజ్ఞప్తి చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!