

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి పక్షాలు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు నగరంతో పాటు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. నెక్లెస్ రోటరీలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఖైరతాబాద్ మీదుగా లోక్‌భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్‌భవన్‌లోకి వెళ్లకుండా పోలీసులు మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయడంతో నాయకులు, కార్యకర్తలు వాటిని దాటేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతిపత్రం సమర్పించేందుకు అనుమతించాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోరగా, భద్రతా కారణాలతో పోలీసులు అనుమతించలేదు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. తరువాత వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆందోళన కారణంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి లోక్‌భవన్ వైపు వెళ్లే మార్గాల్లో ఆంక్షలు విధించడంతో అబిడ్స్, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు చోరీ ఆరోపణలపై ప్రజల్లోకి వెళ్లేందుకు ‘ఓటు బచావో–దేశ్ బచావో’ నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!