

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి బాలికపై జరిగిన దారుణ దాడి తీవ్ర కలకలం రేపింది. హేమంత్ అనే వ్యక్తి తరగతి గదిలోకి వెళ్లి ఎలక్ట్రిక్ రంపంతో బాలికపై దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంఘటనతో పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సినిమాలు, వీడియో గేమ్‌లలో చూపించే హింస చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపుతోందనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’ సినిమాలో కథానాయకుడు తన సోదరిని వేధించిన వారిని ఎదుర్కొనేందుకు కాలేజీకి తుపాకీతో వెళ్లే సన్నివేశాన్ని కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తూ రాప్తాడు ఘటనతో పోల్చారు.
ఈ విమర్శలపై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇలాంటి హేయమైన నేరాలు జరిగినప్పుడు ముందుగా బాధితులకు సానుభూతి తెలిపి, వారికి అండగా నిలవాలని అన్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప.. ప్రతి సమస్యకూ సినిమాలను బాధ్యులుగా చూపించడం సరికాదని పేర్కొన్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం విషాద ఘటనలను ఉపయోగించుకుంటూ ఇతరుల సినిమాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సందర్భాల్లో అవసరమైంది సానుభూతి మాత్రమేనని, అవకాశవాదం కాదని స్పష్టం చేశారు. కాగా, సందీప్‌రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ అధికారిగా కనిపించనుండగా, త్రిప్తి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!