

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అభ్యర్థులు తమ సొంత వార్డుల్లోనే ఓటమి పాలవడం చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెదేపా కూటమి ఛైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు సొంత వార్డు అయిన ఆరో వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. మరోవైపు, వైఎస్సార్‌సీపీ ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు సొంత వార్డు అయిన పదో వార్డులో తెదేపా అభ్యర్థి గెలుపొందారు. ఈ రెండు ఫలితాలు స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీశాయి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన టికెట్ ఆశించి నిరాశకు గురైన గడ్డం సంధ్య, కొలగాని శిరీష స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. సంధ్య 12వ వార్డు నుంచి, శిరీష 11వ వార్డు నుంచి గెలుపొందారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఒకటో వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామకృష్ణమ్మ ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించారు. అయితే, భాజపా అభ్యర్థి సాకే లక్ష్మీదేవి రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక నెల్లూరులో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి సొంత డివిజన్ అయిన చింతారెడ్డిపాలెం ఐదో డివిజన్‌లో తెదేపా అభ్యర్థి అబ్రహం, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జాషువాపై 398 ఓట్ల తేడాతో విజయం సాధించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!