

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు చేసుకునే వారికి ఊరట లభించింది. దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు వరకు అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎన్నికల సంఘం ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు, సర్వర్ ఇబ్బందులు తలెత్తడంతో వేలాది మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక లోపాలను సరిచేసి ఆన్‌లైన్ సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఆ జాబితాపై అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు సమర్పించవచ్చని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తదుపరి ప్రక్రియలను పూర్తి చేసి అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!