

హైదరాబాద్లో నిర్వహించిన భారత్ సమిట్లో ఇటలీ వామపక్ష పీఈఎస్ నేత జియాకోమో ఫిల్బెక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ‘ఓట్ చోర్ గద్దీ చోడ్’ అంటూ ఆయన చేసిన నినాదంపై ఇటలీ అధికార పక్ష నాయకురాలు డెబోరా బెర్గామిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 97 కోట్ల మంది పౌరులకు ఓటు హక్కు కల్పిస్తున్న భారత్కు ప్రజాస్వామ్యంపై ఇతరుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సొంత ప్రజాస్వామ్య సంస్థలు, న్యాయవ్యవస్థ ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఆరోపణలు చేసేవారు వాటికి తగిన ఆధారాలు చూపించాలని పేర్కొన్నారు.
ఇతర దేశాల అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనుచితమని, ముఖ్యంగా మిత్రదేశాల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని బెర్గామిని అన్నారు. మరోవైపు, కాన్ఫరెన్స్ ఈ-వీసాపై భారత్కు వచ్చిన జియాకోమో ఫిల్బెక్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం వీసా నిబంధనల ఉల్లంఘనేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి వీసాపై వచ్చిన విదేశీయులకు భారత రాజకీయాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశాయి. ఫిల్బెక్ వ్యాఖ్యలను కేంద్రమంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు కూడా తప్పుబట్టారు. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ రాజకీయ నాయకులు జోక్యం చేసుకునేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తున్నారని వారు ఆరోపించారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!