

కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ప్రస్తుతం పలు రాజకీయ, పరిపాలనా సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వంపై పూర్తి స్థాయి పట్టు సాధించినప్పటికీ కొన్ని కీలక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు మంత్రివర్గంలో మహిళా నేతకు అవకాశం కల్పించకపోవడం, మంత్రి నాగేంద్ర రెండోసారి రాజీనామా చేయాల్సి రావడం, ఆయన స్థానాన్ని భర్తీ చేయకపోవడం ముఖ్యమంత్రికి ఇబ్బందిగా మారాయి. ఖాళీగా ఉన్న మంత్రి పదవులతో పాటు శాసనమండలి, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులను భర్తీ చేసేందుకు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నట్లు శివకుమార్ ప్రకటించారు. డిసెంబర్ 2 నుంచి బెళగావిలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండటంతో అప్పటిలోగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. ఒక మహిళా నేతకు మంత్రి పదవి కల్పించే అవకాశం ఉండగా.. ఆరుగురు పోటీ పడుతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలని శివకుమార్ భావిస్తుండగా, బళ్లారి ఉప ఎన్నికలో విజయం సాధించిన అన్నపూర్ణ తుకారాంకు అవకాశం కల్పించాలని మాజీ సీఎం సిద్ధరామయ్య పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీంతో మహిళా మంత్రి ఎంపిక అధికార కాంగ్రెస్‌కు కీలక సవాలుగా మారింది.
మరోవైపు నీటి సమస్యలు, సంక్షేమ పథకాల నిధులు, ధరల పెంపుపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులతో జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం, కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేసే అంశంపై న్యాయపోరాటం కొనసాగడం, మేకెదాటు ప్రాజెక్టుకు పూర్తి స్థాయి అనుమతులు రాకపోవడం ప్రభుత్వానికి సవాలుగా మారాయి. గ్యారంటీ పథకాల అమలుకు నిధుల కొరత కారణంగానే ధరలు పెంచుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి గత బడ్జెట్లో కేటాయించిన రూ.46 వేల కోట్లకు పైగా నిధులను గ్యారంటీ పథకాలకు మళ్లించారని దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే బెళగావి సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు BJP, JD(S) వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరవు పరిహారం, పాల ధరలు, రవాణా ఛార్జీల పెంపు, SIR ప్రక్రియ, ప్రభుత్వ అంతర్గత పరిణామాలపై ప్రశ్నలు సంధించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA), పంచాయతీ ఎన్నికల నిర్వహణ కూడా వివాదంగా మారింది. పాత ఓటరు జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తుండగా, అక్టోబరులో విడుదలైన కొత్త ఓటరు జాబితా ఆధారంగా ఎన్నికలు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరులోగా GBA ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, జనవరి నెలాఖరు వరకు గడువు పొడిగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో శీతాకాల సమావేశాలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!