

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు సుమారు లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం విషయంలో రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంటూ, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వివరించారు. కొత్తగా ప్రారంభమవుతున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్, వరంగల్ కేంద్రాల్లో మొత్తం 6,278 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అలాగే హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు తొలి దశకు రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధి పనులకు త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!