

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు. క్రెమ్లిన్‌లో దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ భేటీలో అబుధాబీలో రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి బృందాలతో నిర్వహించిన రెండు రోజుల చర్చల వివరాలను పుతిన్‌కు వివరించారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరాన్ని ఆయనకు తెలియజేశారు. తొమ్మిది నెలల విరామం తర్వాత ఇరుదేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా చర్చలు జరపడం ఇదే తొలిసారి.
అబుధాబీ చర్చల్లో పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ, మరికొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కుష్నర్ వెల్లడించారు. పుతిన్‌తో సమావేశం అనంతరం అమెరికా రాయబారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో చర్చించేందుకు ఐర్లాండ్ వెళ్లనున్నారు. మరోవైపు, మాస్కోతో చర్చలు జరిపేందుకు యూరప్ దేశాల తరఫున ఒకే ప్రతినిధిని నియమించాలని అమెరికా, ఉక్రెయిన్ భావిస్తున్నాయి. అయితే యూరోపియన్ దేశాలతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ పరిణామాలతో రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!