

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన పాస్‌పోర్టు వ్యవహారంపై వచ్చిన వార్తకు సంబంధించి లీగల్ నోటీసు పంపించారు. తన పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశించిందంటూ ప్రచురితమైన వార్త వాస్తవాలకు విరుద్ధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు పాస్‌పోర్టు జప్తునకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఏసీబీ దర్యాప్తు అధికారి పాస్‌పోర్టుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టులో కేవలం మెమో మాత్రమే దాఖలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 10(3)(e) కింద షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ప్రచురితమైన వార్తను వెంటనే ఉపసంహరించుకుని, అదే ప్రాధాన్యతతో సవరణ ప్రచురించాలని, కేటీఆర్‌కు బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. 48 గంటల్లో స్పందించకపోతే తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!