

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. గ్లోబరీనా టెక్నాలజీస్ అంశంలో తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ, 48 గంటల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేదా యాజమాన్య హక్కులు లేవని స్పష్టం చేసిన ఆయన, గడువులోగా క్షమాపణ చెప్పకపోతే సివిల్, క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అవసరమైతే సీఐడీ, సిట్ విచారణలు, లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమని ప్రకటించారు.
హనుమకొండలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి తనపై రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దిల్లీలో విద్యార్థుల నిరసనలపై కాంగ్రెస్ వైఖరిని ప్రస్తావిస్తూ, భాజపా మరియు కేంద్ర ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయకుండా తనపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. దిల్లీలో యువత ఆందోళనలు భాజపాపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, విద్యార్థులు, రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన 50వ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటానని, పార్టీ శ్రేణులు వేడుకలకు ఖర్చు చేసే నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!