

ఆంధ్రప్రదేశ్లో పలు మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కూటమి, వైఎస్సార్సీపీ అభ్యర్థులు సమాన సంఖ్యలో ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడంతో కొన్ని చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు అధికారులు లాటరీ నిర్వహించి విజేతలను ప్రకటించారు. శ్రీసత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలంలో 14 స్థానాలకు గాను ఇరు పార్టీలు చెరో ఏడు గెలిచాయి. దీంతో లాటరీ ద్వారా టీడీపీకి చెందిన పిట్టా ఓబులరెడ్డి ఎంపీపీగా, వైఎస్సార్సీపీకి చెందిన కోటపల్లి హరిత వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోనూ లాటరీ ద్వారా టీడీపీ అభ్యర్థి పుల్లూరు సుజిత ఎంపీపీగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి సొంగా బుజ్జిబాబు వైస్ ఎంపీపీగా విజయం సాధించారు.
విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, వైఎస్సార్సీపీ చెరో తొమ్మిది స్థానాలు గెలుచుకున్నాయి. లాటరీలో టీడీపీ అభ్యర్థి వెన్ని సన్యాసినాయుడు ఎంపీపీగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్నూరి సన్యాసినాయుడు వైస్ ఎంపీపీగా ఎంపికయ్యారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోనూ 12 స్థానాలకు ఇరు పార్టీలు చెరో ఆరు గెలవడంతో లాటరీ నిర్వహించారు. అదృష్టం టీడీపీని వరించడంతో పొట్టేళ్ల పార్వతి ఎంపీపీగా, పోలంరెడ్డి సునీత వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలో 16 స్థానాలకు కూటమి, వైఎస్సార్సీపీ చెరో ఎనిమిది గెలిచాయి. లాటరీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మొల్లేటి శంకర్ ఎంపీపీగా విజయం సాధించగా, ఇరు పక్షాల మధ్య కుదిరిన సయోధ్యతో జనసేన అభ్యర్థి దొడ్డి భారతి వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!