

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కరువు తర్వాత అధికారంలో ఉన్న పార్టీలు గెలిచిన చరిత్ర లేదని, హైటెక్ సిటీ నిర్మాణం గురించి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు సైతం కరువు అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని తాను వ్యాఖ్యానించినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తాను మాట్లాడని మాటలను తన వ్యాఖ్యలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తుమ్మల ఆరోపించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంటూ, వాటికి పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!