

మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు నషా ముక్త్ భారత్ అభియాన్‌ను తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఆంధ్ర మహిళా సభ ఉమెన్స్ కాలేజీలో అలై బలై ఫౌండేషన్, వీనెట్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలనకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని, వాటి అమలు, పర్యవేక్షణ కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుతం విద్యార్థుల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు మాదకద్రవ్యాల వినియోగం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారడం వారి భవిష్యత్తుతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను కేవలం ప్రసంగాలు, అవగాహన సమావేశాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గ్రామాలను గుర్తించి స్థానిక ప్రజలు, బాధితులతో నేరుగా మాట్లాడి మార్పు తీసుకొచ్చేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వ్యసనం నుంచి బయటపడేందుకు చికిత్స పొందుతున్న వారిని ప్రోత్సహించేందుకు పునరావాస కేంద్రాలను సందర్శించి, వారికి మార్గదర్శకత్వం, మానసిక ధైర్యం అందించనున్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ డి. చక్రపాణి, ప్రొఫెసర్ మురళీ మనోహర్, ప్రొఫెసర్ రాజిరెడ్డి, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్ర, సందీప్, విశ్వనాథ్, వీనెట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!