

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ 90కి పైగా అసెంబ్లీ స్థానాలను కచ్చితంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్‌కుమార్‌తో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని కోమటిరెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌కు సూచించినట్లు వెల్లడించారు.
సందీప్‌కుమార్ తొలిసారి రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగానే కలిశామని, సమావేశంలో పార్టీ అంశాలపైనే చర్చించామని మంత్రి పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ రెండోసారి కూడా అధికారంలోకి వస్తుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి పలు సూచనలు చేసినట్లు చెప్పారు. గత మూడేళ్లలో చాలా మంది కార్యకర్తలకు తగిన గుర్తింపు, న్యాయం జరగలేదని.. వారికి ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ అంతర్గత అంశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తుమ్మల తెలిపారు. ఏఐసీసీ, పీసీసీ, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఇన్‌ఛార్జ్‌కు వివరించినట్లు చెప్పారు. మరోవైపు గాంధీభవన్‌లో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్.. వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 అసెంబ్లీ సీట్లే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నేతలకు వివరించినట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!