

ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి హోదాలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం కార్పొరేటర్లతోనూ కలెక్టర్ వరుసగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో కొత్త పాలకవర్గాలు అధికారికంగా కొలువుదీరాయి.
ఏలూరు మేయర్‌గా రెడ్డి అప్పలనాయుడు, కర్నూలు మేయర్‌గా బొల్లెద్దుల విజయ ప్రత్యూష ప్రమాణ స్వీకారం చేశారు. మచిలీపట్నం మేయర్‌గా షేక్ అబ్దుల్ అబీదా బాధ్యతలు చేపట్టారు. ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆమెతో పాటు 60 మంది కార్పొరేటర్ల చేత ప్రమాణం చేయించారు. గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు 76 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన కార్పొరేటర్ యర్రంశెట్టి రాజేష్ డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చిత్తూరు మేయర్‌గా కటారి హేమలత ప్రమాణం చేయగా, డిప్యూటీ మేయర్‌గా ఆర్. గోపీనాథ్ ఎన్నికయ్యారు. డోన్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కోట్ల సుజాతమ్మ, తిరువూరు ఛైర్‌పర్సన్‌గా పసుపులేటి మాధవి బాధ్యతలు స్వీకరించారు.
విశాఖపట్నం జీవీఎంసీలో 119 మంది కార్పొరేటర్లు స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్‌గా పందిరి వెంకట శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నెల్లూరు నగర మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కార్పొరేటర్ల చేత కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి హాజరయ్యారు. గుంటూరులోనూ నూతన పాలకవర్గంతో కలిసి నగర అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తామని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాలకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు హాజరయ్యారు. దీంతో రాష్ట్రంలోని పలు నగర, పురపాలక సంస్థల్లో కొత్త పాలకవర్గాల పాలన ప్రారంభమైంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!