

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాల వాటాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని తెలిపారు. గత భారాస ప్రభుత్వం నీటి వాటాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను సాధించేందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు.
గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, వాటర్‌వర్క్స్, మున్సిపల్ సమస్యలు, దేవాలయాల అభివృద్ధి, పెండింగ్ బిల్లులు, భూమి, రెవెన్యూ, వృద్ధాప్య, ఒంటరి మహిళల పింఛన్లు, ఐటీ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 212 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన శ్రీధర్‌బాబు, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అవసరమని, వాటి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని భారాస నాయకులకు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!