

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత క్షిపణి, వైమానిక రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో పాకిస్థాన్ తన సైనిక ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తన మిత్రదేశమైన తుర్కియేతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా లక్ష మెర్కుట్ ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) డ్రోన్లను కొనుగోలు చేయనున్నట్లు రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు వెల్లడించాయి. ఈ ఒప్పందంలో 10 ఆల్పైన్ మానవ రహిత హెలికాప్టర్లు, 25 డుమ్రుల్ మినీ హెలికాప్టర్లు, 500 డీఎల్ఈ లాయిటరింగ్ మ్యూనిషన్స్, 250 కోర్గాన్ గ్రౌండ్ వ్యవస్థలు కూడా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ఆయుధ వ్యవస్థల తయారీ కోసం పాకిస్థాన్లోనే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ కొనుగోలు చేయనున్న మెర్కుట్ ఎఫ్పీవీ డ్రోన్లు సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తూ, 20 నుంచి 30 నిమిషాల పాటు గాల్లో ఉండగలవని నివేదికలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు కొనుగోలు చేయనున్న ఆల్పైన్ మానవ రహిత హెలికాప్టర్లు సుమారు 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవని, డుమ్రుల్ వ్యవస్థలు స్వల్ప దూర నిఘా, దాడి కార్యకలాపాలకు ఉపయోగపడతాయని సమాచారం. ఆధునిక యుద్ధాల్లో ఎఫ్పీవీ డ్రోన్ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. కెమెరాల ద్వారా ప్రత్యక్ష దృశ్యాలను ఆపరేటర్లకు చేరవేసే ఈ డ్రోన్లను ప్రత్యేక గాగుల్స్ లేదా మానిటర్ల సాయంతో దూరం నుంచే నియంత్రించవచ్చు. తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండటం, సులభంగా నిర్వహించగలగడం వీటి ప్రత్యేకతలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ వీటి వినియోగం భారీగా పెరిగింది. దీంతో భవిష్యత్తు యుద్ధాల్లో మానవరహిత వ్యవస్థలు కీలక పాత్ర పోషించనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎఫ్పీవీ అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ. ఈ డ్రోన్ల ముందు భాగంలో అమర్చిన కెమెరా ద్వారా చిత్రీకరించే దృశ్యాలను ఆపరేటర్లు ప్రత్యేక గాగుల్స్ లేదా మానిటర్లలో వీక్షిస్తూ వాటిని నియంత్రిస్తారు. దీంతో సైనికులు నేరుగా యుద్ధభూమిలోకి వెళ్లకుండానే దూరం నుంచి కార్యకలాపాలు నిర్వహించగలుగుతారు. కొన్ని డ్రోన్లలో ఎలక్ట్రానిక్ జామింగ్ను ఎదుర్కొనేందుకు ఫైబర్ ఆప్టిక్ నియంత్రణ సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లను తయారు చేసి సైనిక కార్యకలాపాలకు వినియోగిస్తోంది. తక్కువ ధర, వేగవంతమైన కదలికలు, సులభమైన నియంత్రణ కారణంగా ఈ డ్రోన్లు ఆధునిక యుద్ధ వ్యూహాల్లో కీలకంగా మారుతున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!