

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత్‌తో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ, పర్యాటకం సహా పలు రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గురువారం విశాఖపట్నంలో ప్రారంభమైన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇటీవల రెండు తుఫాన్లు రాష్ట్ర తీరాన్ని తాకి నష్టం కలిగించినప్పటికీ, ఏపీ వేగంగా కోలుకుని అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల సదస్సుకు ఆతిథ్యమివ్వడం అభినందనీయమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏఐ, క్వాంటం టెక్నాలజీ వంటి భవిష్యత్ సాంకేతికతలపై ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని గోయల్ ప్రశంసించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను దాటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా రాష్ట్రం ముందుకెళ్తోందని అన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపులకు ఎస్క్రో ఖాతాల విధానం తీసుకురావడం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన యువత, విదేశీ పెట్టుబడులు దేశ ఆర్థిక వృద్ధికి కీలకమని తెలిపారు. విశాఖ స్టీల్ సిటీ నుంచి సిలికాన్ సిటీగా ఎదుగుతోందని, ఓర్వకల్లు, పూడిమడక ప్రాంతాలు గ్రీన్ ఎనర్జీ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. భారత్ మేధో సంపత్తి హక్కులను గౌరవిస్తుందని, పెట్టుబడిదారుల సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆవిష్కరణలను కాపాడుతుందని భరోసా ఇచ్చారు. భారత్, ఆంధ్రప్రదేశ్‌లోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రపంచ పారిశ్రామికవేత్తలను కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!