

హైడ్రా కమిషనర్ వ్యవహారం, హైడ్రా కార్యకలాపాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ప్రభుత్వానికి తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో ఒకటని పేర్కొన్న ఆయన, ఏ అధికారిని ఏ పదవిలో నియమించాలన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. హైడ్రా చర్యలపై ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, చెరువులు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారే కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కబ్జా చేసింది పేదలైనా, ధనికులైనా ఎవరినీ ఉపేక్షించబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌పై గతంలో 400కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయని గుర్తు చేస్తూ, అప్పట్లో ఎందుకు ఎవరూ ప్రశ్నించలేదని వ్యాఖ్యానించారు. హైడ్రాపై బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే కేసులు వేస్తున్నారని ఆరోపించిన ఆయన, హైకోర్టు తీర్పు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!