

మేకెదాటు ఆనకట్ట నిర్మాణం, కావేరి జలాల విషయంలో తమిళనాడు హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కావేరి అంశంపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రవేశపెట్టిన ప్రత్యేక సావధాన తీర్మానంపై సీఎం స్పందించారు. కావేరి వివాదం భావోద్వేగాలతో ముడిపడి ఉందని, దీనిని రాజకీయంగా మార్చే ఉద్దేశం తమకు లేదని తెలిపారు. మేకెదాటు ఆనకట్టకు ఎలాంటి పరిపాలనా అనుమతులు ఇవ్వొద్దంటూ ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. కావేరి జలాల పంపిణీపై కర్ణాటకతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినట్లు ప్రభుత్వం తెలిపింది. నిర్ణీత పరిమాణంలో నీరు విడుదల కాకపోవడంతో కావేరి జల నిర్వహణ ప్రాధికార సంస్థను ఆశ్రయించినట్లు పేర్కొంది. పరిస్థితులను బట్టి మేట్టూరు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఇదిలా ఉండగా.. శాసనసభలో పలు అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనలు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనపై నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి డీఎంకే ఎంపీలు హాజరవుతారా అనే అంశంపైనా చర్చ జరిగింది. రాజకీయ విరాళాలు, లిక్కర్, లాటరీ వ్యాపారాలకు సంబంధించిన ఆరోపణలు పరస్పరం చేసుకోవడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘అన్ననిన్ సీర్’ పథకానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులపైనా ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తింది. రాష్ట్ర అప్పులు, అభివృద్ధి ఖర్చులపై కూడా చర్చ జరిగింది. మరోవైపు శాసనసభలో తాగునీటి సరఫరాపై డీఎండీకే పక్షనేత ప్రేమలత సమస్యను ప్రస్తావించారు. అందరికీ బాటిళ్లలో నీరు అందించాలని, హాజరు కోసం సంతకాల స్థానంలో బయోమెట్రిక్ విధానం తీసుకురావాలని ఆమె కోరారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!