

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళకు ప్రతీకలుగా నిలిచేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయా నిర్మాణాల డిజైన్లను సీఎం పరిశీలించారు. కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయం, పిల్లలమర్రి వంటి చారిత్రక కట్టడాల శిల్ప, వాస్తు కళను ప్రతిబింబించేలా నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.
విమానాశ్రయాల నిర్మాణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, రహదారులు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ, నీటి ప్రవాహాలకు సంబంధించిన మార్పులను సమన్వయంతో చేపట్టాలని సీఎం సూచించారు. శాఖల వారీగా విడివిడిగా పనులు చేయకుండా విద్యుత్, ఆర్‌అండ్‌బీ, తాగునీరు, నీటిపారుదల, బీఎస్ఎన్ఎల్ అధికారులు కలిసి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విమానాశ్రయాలకు వచ్చే రహదారులను విశాలంగా నిర్మించి సమీపంలోని ప్రధాన రహదారులకు అనుసంధానం చేయాలని, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. పనులు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!