

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రిపల్లె, తిరుపతి జిల్లా పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్ కేంద్రాల సమీపంలో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగినట్లు సమాచారం. ఎర్రిపల్లెలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ బాంబులు విసరడంతో మంటలు చెలరేగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నల్లపురెడ్డిపల్లెలోనూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రం సమీపంలో పెట్రోల్ బాంబులతో దాడి జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
కడప జిల్లా నందలూరులోనూ ఉద్రిక్తత నెలకొంది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు వాహనాల్లో అక్కడికి రావడంతో స్థానికులు వాటిని అడ్డుకున్నట్లు సమాచారం. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో వైఎస్సార్సీపీ, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయత్నించగా తెదేపా శ్రేణులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జనసేన నాయకురాలిపై వైఎస్సార్సీపీ నేత దాడికి పాల్పడినట్లు సమాచారం. ఆ సమయంలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!