

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పదేళ్ల పాలనను కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల ప్రజాపాలనతో పోల్చి బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల అంశంపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి వ్యవహారాల్లో జరిగిన తప్పులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజలను అసత్య ప్రచారాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఫలించవని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో అధిక భాగాన్ని అమలు చేసిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సుమారు 70 వేల ఉద్యోగాల భర్తీ, రూ.20 వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఉచిత బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, విద్య, వైద్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనను మరిచిపోలేదని, రెండు ప్రభుత్వాల పనితీరును ప్రజలే బేరీజు వేస్తారని ఆయన అన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!