

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖ విషయంలో హైకమాండ్ వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం కల్పించాలన్నది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని అన్నారు. హైకమాండ్ నిర్ణయానికి పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉండాలని సూచించారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు న్యాయం చేయాలని అధిష్ఠానాన్ని కోరారు.
కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో ఆమె కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్ కావడంతో పార్టీలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు పార్టీ నోటీసులు జారీ చేయగా, క్రమశిక్షణ కమిటీ కూడా స్పందించింది. దీంతో ఆమె లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అయితే ఆమెపై హైకమాండ్ తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ కొనసాగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!