

ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా.. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అత్యాధునిక హై-ఎనర్జీ లేజర్ ఆయుధాలను మోహరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. డ్రోన్లు, క్రూజ్ క్షిపణులను ఎదుర్కొనేందుకు వీటిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. లేజర్ వ్యవస్థలు గగనతల లక్ష్యాలను గుర్తించి, వాటి సెన్సర్లను నిర్వీర్యం చేయడం లేదా అధిక శక్తితో కూడిన కిరణాలతో లక్ష్యాన్ని ధ్వంసం చేయగలవని నివేదికలు పేర్కొన్నాయి. కొన్ని వ్యవస్థలను మార్పులు చేసిన ఎక్స్‌బాక్స్ తరహా గేమింగ్ కంట్రోలర్లతో ఆపరేట్ చేస్తున్నట్లు సమాచారం. హై-ఎనర్జీ లేజర్ సాంకేతికత కోసం అమెరికా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తాజాగా ఎండ్యూరింగ్ హై-ఎనర్జీ లేజర్ కార్యక్రమానికి 464.8 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును అమెరికా సైన్యం ప్రకటించింది.
సాంప్రదాయ యాంటీ-డ్రోన్, యాంటీ-మిసైల్ వ్యవస్థలకు ప్రతి లక్ష్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక ఇంటర్‌సెప్టర్ అవసరం కాగా.. లేజర్ ఆయుధాలు విద్యుత్ శక్తిని అధిక శక్తి కాంతి కిరణంగా మార్చి లక్ష్యంపై కేంద్రీకరిస్తాయి. దీంతో అనుకూల పరిస్థితుల్లో ఒక్కో దాడి ఖర్చు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఒకేసారి పెద్ద సంఖ్యలో డ్రోన్లు దాడి చేయడం వంటి సందర్భాల్లో వీటి సామర్థ్యానికి పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు వీటి ప్రధాన వినియోగం గగనతల లక్ష్యాలపై జరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!